సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచు టౌన్ షిప్ లో మూడు రోజులుగా చోటు చేసుకున్న సంఘటనల వేళ రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఇచ్చిన నోటీసులకు సినీ నటుడు మంచు విష్ణు, మనోజ్ బుధవారం హాజరయ్యారు. నేరేడ్ మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలోని మూడవ అంతస్తులో పోలీసు కమిషనర్ సుధీర్ బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో నిర్వహించిన కోర్టు ముందుకు మంచు మనోజ్ వచ్చారు. స్థానికంగా ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పరిస్థితులు మరోసారి నెలకొనకుండా ఉండాలంటే చట్టానికి లోబడి ఉండాలని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్ బాబు ఆదేశించారు. దీంతో మంచు మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్ బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసిచ్చారు. దీంతో మంచు మనోజ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. ఏడాది పాటు ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అధికారులు స్పష్టం చేశారు. అనంతరం రాత్రి మంచు విష్ణు సీపీ సుధీర్ బాబు ముందు హాజరైయారు. ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్ట బద్దంగా నడుచుకుంటామని విష్ణు సీపీ కి హామీ ఇచ్చారు. రాత్రి 8 గంటలకు వచ్చిన విష్ణు గంటన్నర తర్వాత తిరిగి వెళ్లిపోయారు.