ధూల్‌పేట్ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరి
హైదరాబాద్ అంతటా వినాయక చవితి సందడి కనిపిస్తున్నా..ధూల్‌పేట్‌లో ఈ పండుగ మరింత జోరుగా సాగుతోంది. అందుకు కారణం..ఇక్కడి విగ్రహాల తయారీ. రకరకాల రూపాల్లో గణపతిని ఎంతో అందంగా తీర్చి దిద్దిన ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకూ ధరలు పలుకుతున్నాయి ఈ విగ్రహాలు. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విగ్రహాల మార్కెట్‌గా ధూల్‌పేట్‌కి పేరుంది. బాల గణేశుడి విగ్రహాన్ని రూ.20 వేల ధరకు విక్రయిస్తున్నారు తయారీదారులు. ధర ఎక్కువగానే అనిపిస్తున్నా...విగ్రహ తయారీకి అంత కన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెబుతున్నారు. విగ్రహ అలంకరణకూ ఖర్చవుతుందని వివరిస్తున్నారు. విగ్రహ అడుగులను బట్టి ధర నిర్ణయిస్తామని వెల్లడించారు. అయోధ్య రాముడి తరహా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు ఇక్కడి తయారీ దారులు. ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కార్మికులు ఎక్కువ మంది ఉంటే 6 నెలల్లో కనీసం 60 విగ్రహాలు తయారు చేయొచ్చని వివరిస్తున్నారు నిర్వాహకులు. విగ్రహ తయారీ అనేది చిన్న విషయం కాదని, ఎంతో శ్రమించి ఈ రూపు తీసుకొస్తామని చెబుతున్నారు.