Doddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తి
నిజాం నిరంకుశపాలనను వ్యతిరేకిస్తూ తొలుత గళం విప్పిన వీరుడు. 19ఏళ్ల నూనుగు మీసాల వయస్సులోనే తనను కన్న నేల కోసం ప్రాణాలు వదిలేసిన ధీరుడు. కడవెండి గ్రామ పౌరుషం..తెలంగాణ సాయుధపోరాటానికి స్ఫూర్తి..నిత్యం రగిలే చైతన్య దీప్తి దొడ్డి కొమురయ్య. ఆయన ప్రాణత్యాగం చేసి జులై 4వ తేదీకి 78 సంవత్సరాలు నిండాయి. తొలి అమరుడిగా సాయుధ తెలంగాణ పోరాటానికి ఉత్ప్రేరకంగా నిలవటం కోసం తొలి అమరుడిగా మారిన ఆయన చరిత్ర గురించి నేటికీ పుట్టిన కడవెండి గ్రామం పౌరుషంగా చెప్పుకుంటుంది. ఓసారి దొడ్డి కొమురయ్య తిరిగిన ఆ పల్లెను చూసొద్దాం రండి. భూమికోసం.. భుక్తి కోసం... వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కడవెండి గ్రామంలో మొదలైన ఈ తిరుగుబాటు ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ప్రజలను కట్టు బానిసలను చేసి దేశ్ ముఖ్ లు అరాచకాలకు, నిజాం నిరంకుశత్వంపై కడవెండి గ్రామం తిరుగుబాటు మొదలుపెట్టింది. 1927 ఏప్రిల్ 3న కడవెండిలో జన్మించిన కొమురయ్య చిన్నతనం నుంచి ఈ దారుణాలను గమనిస్తూ పెరిగారు. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మ దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో ఆమె పేరు మారుమోగేది. తెలంగాణ సాయుధ పోరాటానికి సేనానిగా వ్యవహరించిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి వెట్టిచాకిరికీ వ్యతిరేకంగా ఆంధ్రమహాసభలో చేసిన సందేశాన్ని కడవెండిలో వినిపించటంతో ఊరిలో యువకులంతా ఏకమయ్యారు. గ్రామంలో వెట్టిచాకిరీ వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేసి దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అలా ముందు వరుసలో నిలబడి పోరాడిన యువకులలో ముఖ్యుడు దొడ్డి కొమురయ్య.