ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణ
నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్, గుండంపెల్లి గ్రామాల్లో సమగ్ర కుల సర్వేను గ్రామస్తులు బహిష్కరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వే ప్రారంభమవడంతో సర్వే నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లారు. ప్రభుత్వం తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తివేసేందుకు సహకరించడం లేదని, ప్రభుత్వానికి తాము ఎందుకు సహకరించాలని ప్రశ్నిస్తున్నారు గ్రామస్థులు. సమగ్ర సర్వేకు వచ్చిన అధికారులకు ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదు. ఫ్యాక్టరీని తరలించేవరకు సమగ్ర కుల సర్వేకు సహకరించేది లేదని తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు లాభం చేకూరుతుందని స్పష్టం చేసింది. పైగా ఈ సర్వేని కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాహుల్ గాంధీ కూడా చాలా సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఈ సర్వే జరగాలని ప్రస్తావించారు.