Congress SC Cell President Died | కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనుమానాస్పద మృతి
మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ నేత మారెల్లి అనిల్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతదేహాన్ని కారులో గుర్తించారు.
ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా, అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు. అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామం పైతరకు కారులో బయలుదేరారు అనిల్. మండలంలోని చిన్నఘనపూర్ సబ్ స్టేషన్ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న అనిల్ ను స్థానికులు మెదక్ లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అనిల్ చనిపోయారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తే వారికి కొన్ని బుల్లెట్లు లభ్యం కావడంతో రోడ్డు ప్రమాదం కాదు, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.