
CM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP Desam
రాజకీయాలు కలుషితమయ్యాయో…నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి తీసేసి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదు వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు ముఖ్యమంత్రి. పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నాం రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నామని వివరణ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదని పరోక్షంగా బండి సంజయ్ ను కిషన్ రెడ్డిని కౌంటర్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం ఇది ఎన్టీఆర్ ను అగౌరవపరిచినట్టు కాదు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నాం. వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి..ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నామన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామన్న రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సవాల్ విసిరారు.