Cabinet Ministers From Telangana | కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం
కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు (Bandi Sanjay) మోదీ కేబినెట్‌లో అవకాశం లభించింది. ఈ మేరకు పీఎంవో నుంచి సమాచారం అందడంతో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు 30 మంది మంత్రులూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అటు, ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది.
తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishanreddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు (Bandi Sanjay) కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. కాగా, గత కేబినెట్‌లోనూ సికింద్రాబాద్ నుంచి విజయం సాధించి కిషన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. అటు, తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ వారికి దగ్గరగా ఉన్న నేతలు, కేంద్ర పెద్దలతో మంత్రి పదవుల కోసం చర్చలు జరిపారు. అయితే, ఎట్టకేలకు ఉత్కంఠ వీడి ఆదివారం మోదీ కేబినెట్‌లో.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.