Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎన్నో అద్భుతాలు. మిగతా పుణ్యక్షేత్రాల లాగా ఇక్కడ రాతితో చెక్కిన విగ్రహాలు ఉండవు. కేవలం వెదురు కర్రలనే పసుపు, కుంకుమలతో అలంకరించి దేవతలుగా కొలుస్తారు. అసలు వెదురునే ఎందుకు పూజిస్తారు?
గిరిజన సంప్రదాయంలో ప్రకృతిని మించిన దైవం లేదు. వాలందరు చెట్లను, పుట్టలను, రాళ్లను దైవంగా భావిస్తారు. గిరిజన జీవనశైలిలో 'వెదురు' అత్యంత కీలకం. తమకు నీడను, ఆహారాన్ని, రక్షణను ఇచ్చే వెదురును శక్తి స్వరూపంగా వారు నమ్ముతారు. అందుకే తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మలను కూడా వెదురు రూపంలోనే చూసుకుంటారు.
చారిత్రక గాథ ప్రకారం, కాకతీయులతో యుద్ధం చేసిన సమ్మక్క శరీరం నిండా గాయాలతో చిలుకలగుట్ట వైపు వెళ్ళింది. తన తల్లి కోసం వెతుకుతూ వెళ్ళిన భక్తులకు అక్కడ సమ్మక్క కనిపించలేదు. కానీ, ఆమె వెళ్ళిన చోట ఒక కుంకుమ భరిణెతో పాటు దట్టమైన వెదురు పొదలు కనిపించాయి. సమ్మక్క తల్లి ఆ వెదురు పొదల్లో, కుంకుమ భరిణెలో కలిసిపోయిందని, ఆ వెదురే తల్లికి ప్రతిరూపమని నమ్మారు కోయ పూజారులు. అప్పటి నుండి వెదురునే ఉత్సవ మూర్తులుగా పూజించడం మొదలుపెట్టారు.
జాతర ప్రారంభానికి ముందు, పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో చిలుకలగుట్టకు వెళ్తారు. అక్కడ ప్రత్యేక ముహూర్తంలో పవిత్రమైన వెదురు బద్ధలను సేకరిస్తారు. సారలమ్మ కన్నెపల్లి నుంచి వెదురు రూపంలో గద్దెపైకి వస్తుంది. సమ్మక్క చిలుకలగుట్ట నుంచి వెదురు గడ, కుంకుమ భరిణె రూపంలో వస్తుంది. ఈ వెదురు గడలను పసుపు, కుంకుమ, నెమలి పించాలతో అలంకరించినప్పుడు అవి సాక్షాత్తూ దేవతల్లాగే కనిపిస్తాయి.
ఈ వెదురు గడలను సేకరించే సమయంలో పూజారులు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారు. జాతర ముగిసిన తర్వాత కూడా ఈ వెదురు గడలను ఎక్కడ పడితే అక్కడ పారేయరు. వాటిని మళ్ళీ పవిత్రమైన ప్రదేశంలో భద్రపరుస్తారు.