Asifabad Agency Problems In Rainy Season: మంచంపై వాగు దాటిస్తే కానీ చికిత్స అందదు!
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బోరిలాల్ గూడ వాసులకు వానాకాలంలో ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలాబాద్ పట్టణానికి రావాలంటే అనార్ పల్లి వాగు దాటాల్సిందే. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.... ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రోజే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. కానీ రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులో ప్రవాహం పెరగడంతో వాయిదా వేస్తూ వచ్చారు. శనివారం సాయంత్రం అతను స్పృహ కోల్పోయాడు. వరద కొంచెం తగ్గడంతో కుటుంబసభ్యులు.... అతణ్ని మంచంపై పడుకోబెట్టి, దాన్ని మోసుకుంటూ వాగు దాటించారు. ఆపై ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రతి ఏడాది బోరిలాల్ గూడ మాత్రమే కాక సమీపంలోని మరికొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి తప్పట్లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు.