
Adilabad Adivasila Holi Duradi | మోదుగపూలతో ఆదివాసీలు చేసుకునే హోళీ పండుగను చూశారా.! | ABP Desam
అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సాంప్రదాయాలు ఆచారాలు అందరికన్న భిన్నంగా ఉంటాయి. హోలీ పండుగను పురస్కరించుకొని ఆదివాసీలు నిర్వహించే దురాడి దులండి వేడుకలు..తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా తాత ముత్తాతల కాలం నుండి నేటికీ ఈ ఆచార వ్యవహారాలు నిర్వహిస్తు అడవుల్లో లభించే మోదుగ పూలతో స్వచ్ఛమైన రంగులతో వేడుకలు సాంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి తమ నుండి కుడుకలు ఇవ్వడం ఆచారం. ఆ గ్రామంలో కుడుక ఇవ్వని వాళ్లు ఆ గ్రామంలో లేనట్టుగా పరిగణిస్తారు. ఇంతకీ ఆదివాసులు మోదుగ పూలతో రంగులను ఎలా తయారు చేస్తారు..? హోలీ పండుగ సందర్బంగా ఆదివాసులు నిర్వహించే దురాడి వేడుకలపై abp దేశం స్పెషల్ రిపోర్ట్.
అ అంటే అడవి.. ఆ అంటే ఆదివాసి.. అడవికి ఆదివాసులకు ఉన్న బంధం విడదీయరానిది. ప్రతి మాసంలో ఏడాదిపాటున తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ప్రకృతి దేవుళ్ళను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. హోలీ పండుగను పురస్కరించుకొని తమ ఆచార వ్యవహారాల ప్రకారం గ్రామంలో కామ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీన్ని ఆదివాసీలు దురాడి అనీ అంటారు. ఈ దురాడి వేడుకలను ఎలా నిర్వహిస్తారంటే..? హోలీ పండుగను పురస్కరించుకొని వచ్చే పౌర్ణమి రోజున గోండు గూడాల్లో ప్రతి ఒక్కరూ గ్రామ పటేల్ ఇంటి వద్ద ప్రతి ఇంటి నుండి కుడకలు తీసుకువచ్చి అందిస్తారు. గ్రామంలో అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల నుంచి కుడుకలు వచ్చాయా లేదా అని పరిశీలిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామంలో దురాడి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.