Women's ODI World Cup 2025 | ఓటమనేదే లేని విశాఖలో సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సీజన్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. ఈ రోజు గురువారం సౌతాఫ్రికా మహిళల జట్టుతో తలపడబోతోంది. విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టోర్నీలో ముచ్చటగా మూడో విజయం కూడా దక్కించుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది. అయితే మొదట ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి.. సఫారీ జట్టు.. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ బలంతో న్యూజిలాండ్‌ను ఓడించి ఊపుమీదుంది. కానీ టీమిండియాకి ఓటమనేదే లేని విశాఖలో ఈ మ్యాచ్ జరుగుతుండడం, మన ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు హ్యాట్రిక్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కానీ మన టీమ్ బ్యాటింగ్ లైనప్‌లో ఉన్న లోపాలని సౌతాఫ్రికా క్యాష్ చేసుకోవడంపై ఫోకస్ పెడితే మాత్రం టీమిండియా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ టోర్నీ స్టార్టింగ్ నుంచి పెద్దగా రాణించడం లేదు. కానీ ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తీ శర్మ, రిచా ఘోష్ లాంటి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. మొదటి 2 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచేసింది. కానీ దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎటాక్‌ని ఎదుర్కొని మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఈ ఇద్దరూ కచ్చితంగా ఫామ్‌లోకి రావల్సిందే. అలాగే నెక్ట్స్ మ్యాచ్ పటిష్ఠ ఆస్ట్రేలియాతో కాబట్టి బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న లోపాలన్నీ ఈ మ్యాచ్‌లోనే అధిగమించాల్సి ఉంటుంది. అలాగే పాక్‌పై విజయంలో కీ రోల్ పోషించిన పేసర్ క్రాంతి గౌడ్, స్పిన్సర్ స్నేహ్ రాణా, దీప్తి శర్మ, శ్రీచరణి వాళ్ల ఫామ్‌ని కంటిన్యూ చేస్తే.. టీమిండియాకి ఈ మ్యాచ్‌లో పక్కా గెలుపు గ్యారెంటీ.




















