Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో 21 ఏళ్ల యువ సంచలనం ముకుల్ చౌదరి కీలక పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులతో విధ్వంసం సృష్టించి, తన జట్టును మూడు వికెట్ల తేడాతో గెలుపు తీరాలకు చేర్చాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, 16 ఓవర్లు ముగిసేసరికి 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. 

గెలవడం అసాధ్యమని భావించిన తరుణంలో ముకుల్ తన పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో కేకేఆర్ బౌలర్లను చిత్తు చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, ఏకంగా 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక 19వ ఓవర్‌లో  కాస్ట్లీ ఓవ‌ర్ సీస్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఆ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. 

ఆఖరి ఓవర్‌లో మళ్ళీ వైభవ్ అరోరా బౌలింగ్‌లోనే రెండు సిక్సర్లు బాది తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా, లక్నోకు మరపురాని విజయాన్ని అందించాడు. ముకుల్ చౌదరి రాజస్థాన్ తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో ఈ కుర్రాడి కోసం లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గట్టి పోటీ జరిగింది. చివరకు లక్నో 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో అత్యంత దూకుడుగా ఆడే ప్లేయర్‌గా ముకుల్ కు గుర్తింపు ఉంది. టీ20ల్లో ఇత‌ని స్ట్రైక్ రేట్ 160కి పైగా ఉండటం విశేషం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola