VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
తెలుగు యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వరుస గాయాల బారిన పడుతుండటంపై నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ VVS లక్ష్మణ్ స్పందించారు. ఇటీవల ప్లేయర్స్ వరుసగా గాయపడుతుండటంతో బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియాలు లక్ష్మణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన నితీష్, క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణాలతో కలిసి నితీష్ CoE లో రీహాబిలిటేషన్ పొందుతున్నాడు.
"ఒక ఆల్‌రౌండర్‌గా నితీష్‌పై బ్యాటింగ్, బౌలింగ్ వర్క్‌లోడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. గాయాలు కెరీర్‌లో సహజమే అయినా, ప్లేయర్స్ మెంటల్ హెల్త్, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై CoE లో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. ప్రస్తుత క్రికెట్ క్యాలెండర్‌లో ఆఫ్-సీజన్ అనేది లేదు. ఐపీఎల్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు వరుసగా ఆడుతున్నప్పుడు లభించే చిన్న బ్రేక్స్‌ను ఫిట్‌నెస్ పెంచుకోవడానికి వాడుకోవాలి" అని సూచించారు.
స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లెరూక్స్ ప్రవేశపెట్టిన 'బ్రోంకో టెస్ట్' గురించి కూడా లక్ష్మణ్ మాట్లాడారు. సిరీస్ జరుగుతున్న సమయంలో యో-యో టెస్ట్ పెట్టడం వల్ల ప్లేయర్ల శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడి రికవరీ కష్టమవుతుందని, అందుకే బాడీ కండిషనింగ్‌కు ఉపయోగపడే బ్రోంకో టెస్ట్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని వివరించారు.