RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరుసగా రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. కింగ్ విరాట్ కోహ్లీ విజయ గర్జనతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను ఆర్‌సీబీ బౌలర్లు ఆరంభం నుంచే దెబ్బకొట్టారు. సీజన్ మొత్తం అదరగొట్టిన గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ లాంటి టాప్-3 బ్యాటర్లు ఫైనల్ మ్యాచ్‌లో దారుణంగా చేతులెత్తేశారు. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 37 బంతుల్లో 50 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వాళ్లంతా విఫలం కావడంతో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ సూపర్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ పరుగుల వరద పారించారు. రబాడ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదారు. అయ్యర్ 32 పరుగులకి అవుట్ అయిన తర్వాత.. పడిక్కల్, పాటిదార్, కృనాల్ వరుసగా అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. చివరికి 42 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ.. జితేష్ శర్మతో కలిసి 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఆర్‌సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు.