Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో, అంతటి కఠిన నిర్ణయాలు తీసుకోగలడు. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో రహానే తీసుకున్న ఒక నిర్ణయం, నేటి టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కెరీర్‌ను రక్షించింది.
వెస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో జైస్వాల్, ప్రత్యర్థి బ్యాటర్ తో నిరంతరం స్లెడ్జింగ్‌కు దిగాడు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అంపైర్లు వెస్ట్ జోన్ కెప్టెన్ రహానేకు ఫిర్యాదు చేశారు. రహానే ఎంత నచ్చజెప్పినా జైస్వాల్ వినకుండా వాగ్వాదాన్ని కొనసాగించాడు. దాంతో డిసిప్లిన్ కాపాడటానికి రహానే ఏమాత్రం వెనుకాడకుండా జైస్వాల్‌ను మైదానం నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పాడు.
ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ రహానే వద్దకు వచ్చి ఒక విషయాన్ని బయటపెట్టాడు. జైస్వాల్ ప్రవర్తనకుగానూ అతనిపై 4 మ్యాచ్‌ల నిషేధం విధిస్తూ ఆర్డర్ లెటర్ కూడా సిద్ధం చేసినట్లు చెప్పాడు. అయితే, కెప్టెన్‌గా రహానే వెంటనే సారీ చెప్పి జైస్వాల్‌ను గ్రౌండ్ బయటకు పంపినందుకు మెచ్చి, రిఫరీ ఆ బ్యాన్ లెటర్‌ను రహానే ముందే చింపేశాడు. రహానే ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల జైస్వాల్ భారీ శిక్ష నుంచి తప్పించుకున్నాడు.