Neeraj Chopra Diamond League 2024 | నీరజ్ చోప్రా విజయం వెనుక ఓ కెన్యా ప్లేయర్ | ABP Desam
గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న నీరజ్ చోప్రా..అలాగే పారిస్ ఒలింపిక్స్ ఆడేశాడు. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ 90కి పైగా రెండు సార్లు విసిరి గోల్డ్ మెడల్ కొడితే...టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ కొట్టిన నీరజ్ పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆ వెంటనే లుసానేలో జరిగిన డైమండ్ లీగ్ లోనూ నీరజ్ పాల్గొనాల్సి వచ్చింది. సెప్టెంబర్ లో బ్రస్సెల్స్ లో జరిగే ఫైనల్లో ఆడాలంటే లుసానే లీగ్ కచ్చితంగా ఆడాల్సి ఉండటంతో నీరజ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. రెండో స్థానాన్ని సాధించాడు. అయితే ఈ రెండో ప్లేస్ తను సాధించటం వెనుక ఓ కెన్యా ప్లేయర్ తోడ్పాటు ఉందని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ఈటెను అత్యధిక దూరం విసిరి సత్తా చాటేందుకు ఆరు ఛాన్సులు ఉండగా తొలి ఐదు ఛాన్సుల్లోనూ నీరజ్ చోప్రా 85మీటర్లు దాటించలేకపోయాడు. అప్పటికే గ్రెనెడా ఆటగాడు ఆండర్సన్ 90మీటర్లు విసరటంతో ఇక నీరజ్ చోప్రా ఆశలు కోల్పోవాల్సిన పరిస్థితి. ఓ వైపు శరీరం సహకరించక మరో వైపు ప్రత్యర్థి ఆటగాడు అంత విసిరేప్పటికి నీరజ్ చోప్రా ఒత్తిడికి గురయ్యాడట. అలాంటి టైమ్ లో కెన్యా ఆటగాడు జులియెస్ యెగో నీరజ్ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాడట. ప్రశాంతంగా ఉండు. నువ్వు ఇంతకంటే ఇంకా ఎక్కువ విసరగలవు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. మిగిలినవన్నీ మర్చిపో అన్నాడట యెగో. తనతో తలపడుతున్న తన ప్రత్యర్థి నుంచి అలాంటి సహకారం అంత క్రూషియల్ టైమ్ లో రావటంతో నీరచ్ చోప్రా రెచ్చిపోయాడు. అంతే ఈ సారి విసిరితే 89.49 మీటర్ల దూరం వెళ్లి పడింది జావెలిన్. దెబ్బకు రెండో స్థానం సంపాదించాడు నీరజ్ చోప్రా. పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కొట్టడానికి నీరజ్ చోప్రా విసిరింది 89.45 మీటర్లే. అంతకు మించి దూరాన్ని డైమండ్ లీగ్ లో విసిరిన నీరజ్ చోప్రా ఆ కెన్యా ఆటగాడి సహకారంతో రెండో స్థానాన్ని సాధించాడు. నీరజ్ కు సహకరించిన కెన్యా ఆటగాడు జులియస్ యెగో మాత్రం తొమ్మిదో స్థానంలో నిలిచాడు.