Shreyas Iyer Rare Feat as IPL Captain | ఐపీఎల్ లో అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అత్యంత అరుదైన రికార్డును సృష్టించాడు. ఓ కెప్టెన్ గా తన జట్టును క్వాలిఫైయర్స్ కి తీసుకువెళ్లటమే పెద్ద విషయం అలాంటిది మూడు వేర్వేరు జట్లను క్వాలిఫైయర్స్ కి తీసుకువెళ్లిన కెప్టెన్ గా తిరుగులేని రికార్డును తన పేరు మీద నెలకొల్పాడు శ్రేయస్ అయ్యర్. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన ఐపీఎల్ కెరీర్ ను స్టార్ట్ చేసిన అయ్యర్ ఆ తర్వాత అదే జట్టుకు 2020 లో కెప్టెన్ అయ్యాడు. ఆడిన మొదటి ఏడాదే తన జట్టును ఐపీఎల్ ఫైనల్ కి తీసుకువెళ్లిన ఘనత శ్రేయస్ అయ్యర్ ది. 2020లో తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఢిల్లీ ముంబై చేతిలో ఓడిపోయింది కానీ ఢిల్లీ చరిత్రలో ఇప్పటివరకూ అదొక్కసారే ఫైనల్ మ్యాచ్ ఆడటం. అలాంటి కెప్టెన్ ను వదిలిపెట్టేసింది ఢిల్లీ. తర్వాత కేకేఆర్ కు మారిన శ్రేయస్ అయ్యర్ అక్కడ కూడా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. గతేడాది అంటే 2024 కేకేఆర్ కి కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఏకంగా తన టీమ్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. కేకేఆర్ కి అది మూడో కప్ కాగా శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్ గా తొలి కప్. అలాంటిది పదేళ్ల తర్వాత కప్ తెచ్చిన శ్రేయస్ అయ్యర్ రిటైన్ చేసుకోకుండా వదిలేసుకుంది కోల్ కతా నైట్ రైడర్స్. బహుశా కేకేఆర్ కప్ గెలవటంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కంటే అప్పుడు మెంటార్ గా ఉన్న గౌతం గంభీర్ పాత్రే ఎక్కువగా ప్రొజెక్ట్ అవ్వటంతో శ్రేయస్ అయ్యర్ ను లైట్ తీసుకున్న కేకేఆర్ టీమ్ రిటైన్ చేసుకోకుండా ఆక్షన్ కు అయ్యర్ ను వదిలిపెట్టేసింది. అయితే అయ్యర్ విలువ తెలుసుకున్న పంజాబ్ ఏకంగా లీగ్ చరిత్రలోనే రెండో అత్యధిక మొత్తం అంటే 26కోట్ల 75లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంది. తనపై అంత నమ్మకం పెట్టిన జట్టుకు అద్భుతంగా నాయకత్వం వహించిన అయ్యర్ ఈసారి పంజాబ్ ను క్వాలిఫైయర్స్ కు పట్టుకెళ్లాడు. 11ఏళ్ల తర్వాత పంజాబ్ క్వాలిఫైయర్స్ ఆడుతుండటం ఇదే మొదటిసారి కాగా...గతంలో 2008లో ఓసారి, 2014 చివరిసారి పంజాబ్ క్వాలిఫైయర్స్ వరకూ వెళ్లగలిగింది. ఇలా మూడు వేర్వేరు జట్లను క్వాలిఫైయర్స్ కి తీసుకువెళ్లిన అయ్యర్ మాత్రం తన పేరు మీద అరుదైన రికార్డును క్రియేట్ చేసుకోగా..పంజాబ్ కప్ గెలిస్తే మాత్రం రెండు వేర్వేరు టీమ్స్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన తొలి కెప్టెన్ గా చరిత్రలో తన పేరు ను సువర్ణాక్షరాలతో లిఖించుకుంటాడు శ్రేయస్ అయ్యర్.