RCB vs PBKS IPL 2025 Final Preview | తుది సమరంలో ఆర్సీబీతో పంజాబ్ అమీతుమీ
రెండు జట్లకు ఒకటే కల. ఐపీఎల్ కప్ గెలిచి ముద్దాడాలి అని. దాని కోసం రెండు జట్లు 18ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈరోజు రాత్రికి జరిగే ఐపీఎల్ ఫైనల్ ఓ జట్టు కలను తీర్చనుంది. ఓ జట్టు ఐపీఎల్ కి కొత్త ఛాంపియన్ గా నిలవనుంది. మరి ఆ అదృష్టం దక్కే జట్టు ఏది. అదే ఇంట్రెస్టింగ్ ఈ రోజు. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు పోరాడిన తీరు ఫైనల్ కి చేరుకున్న విధానం స్ఫూర్తి దాయకం. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న జట్లే మళ్లీ ఫైనల్ కూడా ఆడుతుండటం యాధృచ్ఛికమే అయినా ఈ రెండు జట్ల బలాబలాలను అసలు ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఆర్సీబీ జట్టుకు ఇది నాలుగో ఫైనల్. 2009, 2011, 2016 సీజన్ లల్లో ఫైనల్లో బోల్తా కొట్టిన ఆర్సీబీ తృటిలో కప్పు కలను కోల్పోయింది. పంజాబ్ కు ఇది రెండో ఫైనల్. 2014లో మాత్రమే ఐపీఎల్ ఫైనల్ ఆడిన పంజాబ్ అప్పుడు కోల్ కతా కు కప్పును సమర్పించుకుంది. ఈసారి ఎలా అయినా సరే ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కుర్రాళ్లతోనే అద్భుతాలు చేస్తుంటే..విరాట్ కొహ్లీ 18ఏళ్ల కలను తీర్చాలని రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ కసితో రగిలిపోతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో రెండు జట్లు హోరా హోరీ తలపడటం ఖాయం. 18ఏళ్లలో ఈ రెండు జట్లు 36సార్లు తలపడగా చెరో 18 మ్యాచులు గెలుచుకున్నాయి. కానీ ఆఖరి 6సార్లు ఈ రెండు జట్లు తలపడిన మ్యాచుల్లో ఆర్సీబీనే ఐదుసార్లు గెలిచింది. ఈ సీజన్ లో మూడు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడగా ఆర్సీబీని పంజాబ్ బెంగుళూరులో ఓడిస్తే...ఆర్సీబీ పంజాబ్ ను పంజాబ్ లో ఓడించటంతో పాటు క్వాలిఫైయర్ 1 లోనూ కోలుకోలేని షాక్ ఇచ్చింది. చూడాలి మరి ఈ రోజు మ్యాచ్ ను గెలుచుకుని 18ఏళ్ల కలను తీర్చుకునేది ఎవరో..ఐపీఎల్ కొత్త ఛాంపియన్ గా నిలిచేది ఎవరో.