PBKS vs DC Match Highlights IPL 2025 | టాప్ 2 ప్లేస్ పక్కా చేసుకోనివ్వకుండా పంజాబ్ కి ఢిల్లీ అడ్డం | ABP Desam
ఈ సీజన్ లో ఫస్టాఫ్ సూపర్ హీరోలా ఆడి సెకండాఫ్ డీలా పడిన ఢిల్లీ ఎలిమినేట్ అయిపోయినా వెళ్తూ వెళ్తూ పంజాబ్ కి పవర్ పంచ్ ఇచ్చి వెళ్లింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుందామని ఆశపడిన పంజాబ్ ప్లాన్స్ పై నీళ్లు చల్లుతూ ఢిల్లీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఐపీఎల్ రీషెడ్యూలింగ్ లో భాగంగా జైపూర్ ను హోం గ్రౌండ్ గా మార్చుకుని ఆడుతున్న పంజాబ్...ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవటంతో ముందు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య విఫలమైనా ప్రభ్ సిమ్రన్, జోష్ ఇంగ్లీష్ తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత పోరాటం చేశాడు. ప్రభ్ సిమ్రన్ 28, ఇంగ్లిస్ 32 పరుగులు చేస్తే కెప్టెన్ అయ్యర్ 5ఫోర్లు 2 సిక్సర్లతో 34 బాల్స్ లో 53పరుగులు చేశాడు. కానీ బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై పంజాబ్ భారీ స్కోరు చేస్తుందా లేదా అన్న డౌట్ లేకుండా చేసింది మాత్రం మార్కస్ స్టాయినిస్. ఆస్ట్రేలియా నుంచి తిరిగివచ్చి జట్టుతో యాడ్ అయిన స్టాయినిస్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఆడినా 3ఫోర్లు 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి పంజాబ్ స్కోరు 200 దాటించి ఢిల్లీకి 207పరుగుల టార్గెట్ పెట్టాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ అందరూ సమష్ఠిగా రాణించటంతో లక్ష్యాన్ని చేధించగలిగింది. రాహుల్ 21 బాల్స్ లో 35 పరుగులు చేస్తే..ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపికైన జోష్ లో ఉన్న కరుణ్ నాయర్ 27 బాల్స్ లో 5ఫోర్లు 2 సిక్సర్లతో 44పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే చివర్లో భారీ స్కోరు ఛేజ్ చేయాల్సి ఉన్నా సమీర్ రిజ్వీ అద్భుతం చేశాడు. పంజాబ్ బౌలర్లను రఫ్పాడిస్తూ 25 బాల్స్ లో 3 ఫోర్లు 5 భారీ సిక్సర్లతో 58పరుగులు చేసిన రిజ్వీ ఆటతోనే ఢిల్లీ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో సంచలన విజయం సాధించటంతో పాటు పంజాబ్ టాప్ 2 కన్ఫర్మ్ కాకుండా పవర్ పంచ్ ఇవ్వగలిగింది.