IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League ) 19వ సీజన్‌కు నగారా మోగింది. ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు జరగనున్న మొదటి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని బోర్డు ప్రకటించింది.
మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆరంభ వేడుకల అనంతరం తొలి పోరు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) , మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. సొంత గడ్డపై ఆర్‌సీబీ బోణీ కొట్టాలని చూస్తుండగా, హైదరాబాద్ తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరుసటి రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొంటాయి.
ఈ సీజన్‌లో మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబా, హైదరాబాద్‌లలో జరగనున్నాయి. అయితే బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. మార్చి 13న ఈ కమిటీ చిన్నస్వామి స్టేడియాన్ని సందర్శించి, మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. పూర్తిస్థాయి మాక్ డెమాన్స్‌ట్రేషన్ తర్వాతే బెంగళూరు వేదికపై తుది నిర్ణయం వెలువడనుంది.