India Pakistan Match Asia Cup 2025 | సెప్టెంబర్ 21న మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్!

ఆసియా కప్ 2025 సీజన్లో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా చెలరేగి.. దాయాదీ పాకిస్థాన్‌‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ఇదే టోర్నీలో ఇంకోసారి భారత్ చేతిలో చిత్తవడానికి రెడీ అవుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు భారత్‌కి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. భారత బౌలర్ల ధాటికి వణికిపోయింది. ఓ దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అని పాక్ ఫ్యాన్స్ భయపడిపోయారు. కానీ షాహీన్ షా అఫ్రిది దూకుడుగా ఆడి 16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 రన్స్ చేయడంతో అతి కష్టం మీద 127 పరుగుల స్కోర్ చేసింది. కానీ ఆ స్కోర్ ఇండియా ముందు ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇండియన్ బ్యాటర్లు ఇంకో 25 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసి పాక్ పరువు తీసేశారు. అయితే ఇదే తరహా అవమానాన్ని ఇదే టోర్నీలో పాకిస్తాన్ ఇంకోసారి అనుభవించే అవకాశాలున్నాయి. లీగ్ స్టేజ్‌లో బుధవారం యూఏఈతో జరగబోయే మ్యాచ్‌లో ఒకవేళ గెలిస్తే.. సూపర్ 4 బెర్త్ దక్కించుకుంటుంది పాకిస్తాన్. అదే జరిగితే అప్పుడు సెప్టెంబర్ 21 ఆదివారం నాడు మళ్లీ భారత్‌తో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఒకవేళ ఇండియా చేతిలో ఓడిపోయినా.. ఆ తర్వాత శ్రీలంకతో పాటు ఆఫ్గాన్ లేదా బంగ్లాతో జరిగే మ్యాచ్‌లలో గెలిస్తే.. ఆ తర్వాత ఫైనల్‌కి కూడా చేరే అవకాశాలున్నాయి. ఇండియా కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి.. ఫైనల్‌కి చేరితే అక్కడ ముచ్చటగా మూడోసారి భారత్, పాక్ తలపడే ఛాన్స్ ఉంది. అయితే ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, పాక్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడింది లేదు. మరి ఈ సారి చరిత్ర మారుతుందేమో చూడాలి. కానీ పాక్ జట్టును చూస్తుంటే మాత్రం సూపర్ 4 వరకు ఎలాగోలా తంటాలు పడి వచ్చినా.. అటు నుంచి అటే తట్టా, బుట్టా సర్దుకునేలా ఉంది కానీ.. ఫైనల్ చేరే కళ కనిపించడం లేదు. మి మీరేం అంటారు? ఇండియా, పాక్ ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉందంటారా?
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola