శ్రీలంక దుమ్ముదులిపిన టీమిండియా | ABP DESAM
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 43 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ వరుస బంతుల్లోనే అవుటయ్యారు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 58 పరుగులు చేశారు. తనకు పంత్ వద్ద నుంచి మంచి సహకారం లభించింది. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన పంత్ ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వేగం పెంచాడు. 33 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ రాణించలేదు. దీంతో 230-240 వరకు వెళ్తుందనుకున్న స్కోరు 213 దగ్గరే ఆగిపోయింది. అనంతరం శ్రీలంకకు కూడా ఓపెనర్లు పతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 8.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. 27 బంతుల్లోనే 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. కుశాల్ మెండిస్ అవుటైనప్పటికీ పతుం నిశ్శంక పోరాటం ఆపలేదు. కేవలం 48 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. పతుం నిశ్శంక అవుట్ అవ్వగానే శ్రీలంక ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయింది.