భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే
ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ టెస్ట్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ గెలిచి ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది. నేడు అంటే గురువారం భారత్... బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు ఆడనుంది. పాకిస్థాన్‌ను వారి దేశంలో చిత్తుగా ఓడించి ఎనలేని ఆత్మ విశ్వాసంతో ఉన్న బంగ్లా జట్టు..టీమిండియాతో మ్యాచులో ఎలా ఆడబోతుందన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. స్వదేశంలో భారత జట్టును ఓడించడం అంత సులభం కాదు. కానీ బంగ్లాదేశ్ ఉన్న ఫామ్ లో ప్రస్తుతం ఏదైనా సాధ్యమే అని అనిపిస్తోంది. భారత జట్టుపై ఇప్పటివరకూ ఒక్క టెస్టు మ్యాచు కూడా గెలవని బంగ్లాదేశ్.. ఆ రికార్డును కాలగర్భంలో కలిపేయాలని కంకణం కట్టుకుంది. ఆ రికార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ పదిలంగా ఉంచుకోవాలని రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది. మరి ఈ మ్యాచులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
భారత్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటివరకూ మొత్తంగా 13 టెస్టు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ 13 మ్యాచుల్లో బంగ్లాదేశ్ కనీసం ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 11 మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా... రెండు టెస్టు మ్యాచులు డ్రాగా ముగిశాయి. కానీ ఇప్పుడు మాత్రం బంగ్లాదేశ్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా మాత్రం గత ఆరు నెలలుగా ఒక్క టెస్టు మ్యాచు కూడా ఆడలేదు. భారత్‌ను భారత్‌లో ఓడించడం అనేది క్రికెట్ ఆడే ఏ జట్టుకి అయినా కలే. ఆ కలను నెరవేర్చుకునేందుకు బంగ్లా సమాయత్తమైంది.