ఆ వీడియో ఎలా బయటపెడతారు?.. పీసీబీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తన చిల్లర పనులతో ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆల్రెడీ ఇండియాతో షేక్ హ్యాండ్‌ ఇష్యూపై రచ్చ చేసిన పాకిస్తాన్.. అంపైర్‌ని తీసేస్తే కానీ టోర్నీ ఆడేది లేదంటూ చేసిన గొడవతోనే ఐసీసీ సీరియస్‌ అయింది. ఇక సెప్టెంబర్ 17న యూఏఈతో మ్యాచ్‌ సందర్భంగా గ్రౌండ్‌కి గంట ఆలస్యంగా రావడంతో ఐసీసీకి చిర్రెత్తుకొచ్చినట్లైంది. కానీ ఆసియా కప్‌ మధ్యలో ఆపడం ఇష్టం లేక.. ఆండీ పైక్రాఫ్ట్‌కి, పాక్ క్రికెట్ బోర్డ్‌కి ఇంటర్నల్‌గా రాజీ కుదిర్చింది. అయితే సమావేశంలో మీడియా మేనేజర్‌ని అనుమతించడానికి రూల్స్ ఒప్పుకోకపోయినా.. పీసీబీ టోర్నీ నుంచితప్పుకుంటామని బెదిరించడంతో మ్యాచ్‌ని కాపాడటానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్.. పాక్ టీమ్‌ని, మేనేజ్‌మెంట్‌ని కలిసి మాట్లాడిన వీడియోను పీసీబీ రికార్డ్ చేయడమే కాకుండా.. దానిని బయటపెట్టడంతో ఐసీసీ సహనం కోల్పోయింది. ‘మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, పాక్ కోచ్ మైక్ హెస్సన్ మధ్య జరిగిన సమావేశాన్ని పీసీబీ రికార్డు చేయడానికి ప్రయత్నించింది. ఐసీసీ మీడియా మేనేజర్లకు ఈ సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ.. పీసీబీ తన మీడియా మేనేజర్‌ను తీసుకొచ్చింది.  అక్కడితో ఆగకుండా పాక్ టీమ్‌కి, పీసీబీకి పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పారంటూ పీసీబీ మీడియాకి అనౌన్స్ చేయడం కూడా రూల్స్‌కి విరుద్ధం.  ఇది 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫీషియల్స్ ఏరియా (PMOA)' నిబంధనలను ఉల్లంఘించడమే.’ అంటూ ఐసీసీ సీఈఓ సజోగ్ గుప్తా పీసీబీకి సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఒక ఈమెయిల్ పంపారు. అంతేకాకుండా.. పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పేదని.. కేవలం కమ్యూనికేషన్ లోపంపై విచారం మాత్రమే వ్యక్తం చేశారని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందోనని వేచి చూస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించకపోతే.. తదుపరి చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది.పీసీబీ ప్రవర్తన.. ఆట నియమాలకు, స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని భావిస్తున్న ఐసీసీ.. మరి ఎలాంటి జరిమానాలు విధిస్తుందో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola