Drop in Pitches in T20 World Cup 2024 | డ్రాప్ ఇన్ పిచ్‌లపై జరగనున్న టీ20 వరల్డ్ కప్
2024 టీ20 ప్రపంచకప్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ స్టేడియంలో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లను ఉపయోగించనున్నారు.
అసలు డ్రాప్ ఇన్ పిచ్‌లు అంటే ఏంటి?
సింపుల్‌గా చెప్పాలంటే... క్రికెట్ మైదానంలో మనం 22 గజాల పిచ్‌ను చూస్తాం కదా. సరిగ్గా ఆ 22 గజాల పిచ్‌ను ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడి గ్రౌండ్‌లో సెట్ చేస్తారన్న మాట. డల్లాస్, ఫ్లోరిడాల తరహాలో న్యూయార్క్‌లో ట్రెడిషనల్ క్రికెటింగ్ సెంటర్లు లేవు. కాబట్టి ఇక్కడ పిచ్ క్యూరేటర్లను సంపాదించడం, పిచ్‌ను రూపొందించడం అనేది కష్టమైన పని. అది కూడా ఐసీసీ ఈవెంట్‌లో ఏమైనా తేడాలు జరిగితే అది దేశానికే పెద్ద మచ్చగా మిగులుతుంది. అందుకే డ్రాప్ ఇన్ పిచ్‌లను ఉపయోగించాలని నిర్ణయించారు.
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ అనే సంస్థ పిచ్‌లను రూపొందిస్తుంది. డ్రాప్ ఇన్ పిచ్‌లను తయారు చేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. టీ20 వరల్డ్ కప్ కోసం ఉపయోగించే పిచ్‌ల తయారీకి సంబంధించిన పనులు 2023 డిసెంబర్‌లోనే ప్రారంభం అయ్యాయి. అడిలైడ్‌లో ట్రేల ద్వారా పిచ్‌లు రూపొందించి వాటిని ఫ్లోరిడాలో అసెంబుల్ చేశారు. ఫ్లోరిడా నుంచి వాటిని న్యూయార్క్‌కు తరలించనున్నారు. చలికాలంలో న్యూయార్క్ కంటే ఫ్లోరిడాలో మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే న్యూయార్క్‌లో కాకుండా ఫ్లోరిడాలో వీటిని అసెంబుల్ చేశారు.