Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెరీర్ ని కోచ్ గంభీర్ నాశనం చేస్తున్నాడన్నాడు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్. టెస్టుల్లో సుందర్ ను మూడో స్థానంలో ఆడించడం అతడి కెరీర్ నే ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించాడు. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు.
సొంతంగా స్పిన్ వికెట్‌ను తయారు చేయించుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా.. అదే స్పిన్ కి బలైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలుగో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకున్న వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటర్‌గా వాడుకుంది. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపించింది. మిగతా బ్యాటర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. అతను బౌలింగ్ చేయలేదు. అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు విపరీతంగా విమర్శలోస్తున్నాయి. దినేశ్ కార్తీక్ కూడా ఈ విషయంలో ఘాటుగా స్పందించాడు.
'టెస్ట్ క్రికెట్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఎలా చూస్తున్నారు? బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గానా? లేక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గానా? అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పరోక్షంగా సూచిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగిస్తే అతను పూర్తిగా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెడుతాడు. అది బౌలర్ గా అతని కెరీర్ ను ఎండ్ చేస్తుంది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. అలాగని అతన్ని బ్యాటర్‌గా ప్రమోట్ చేస్తే రెండింట్లో ఫెయిల్ కావచ్చు. అది అతనికి కెరీర్‌కే ప్రమాదం.' అని దినేశ్ కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.