South Africa vs Nepal | పసికూనపై ఘోర పరాజయం తృటిలో తప్పించుకున్న సౌతాఫ్రికా | T20 World Cup 2024
వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్ లో నేపాల్ పెను సంచలనమే సృష్టించేది. అది కూడా సౌతాఫ్రికా లాంటి దిగ్గజ జట్టు మీద. పాపం జస్ట్ మిస్. ఒక్క పరుగు ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయారు నేపాల్ క్రికెటర్లు. గ్రూప్ డీలో సౌతాఫ్రికా తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఈ రోజు నేపాల్ తో ఆడింది. ఆ ఏముందిలే నేపాల్ బౌలర్లే కదా కుమ్మిపారేద్దాం అనుకున్న సఫారీలకు చుక్కలు కనిపించాయి. స్పిన్నర్ కుశాల్ భుర్టేల్, పేసర్ దీపేంద్ర సింగ్ ఇద్దరూ కలిసి సౌతాఫ్రికాను గడగడలాడించారు. ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్ లు, మిడిల్ ఆర్డర్ లో డేవిడ్ మిల్లర్ ల పని దీపేంద్ర సింగ్ పడితే...అరివీర భయకంర బ్యాటరైన క్లాసెన్ తో పాటు మార్ క్రమ్, మారో జాన్సన్, రబాడా సంగతి భుర్టేల్ చూసుకున్నాడు. దీపేంద్ర మూడువికెట్లు, భుర్టేల్ నాలుగు వికెట్ల తో రాణించటంతో అనూహ్యంగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7వికెట్లు నష్టపోయి 115పరుగులు మాత్రమే చేయగలిగింది. 116పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన నేపాల్..బౌలింగ్ లో రాణించిన కుశాల్ భుర్టేల్ ఆసిఫ్ షేక్ తో కలిసి చాలా కాన్ఫిడెంట్ గా ఛేజింగ్ ప్రారంభించాడు. కానీ సౌతాఫ్రికా షంసీ అద్భుతంగా బౌలింగ్ చేయటంతో 13.4ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగిన నేపాల్ అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. ఆసిఫ్ షేక్ 42పరుగులు, అనిల్ షా 27పరుగులతో మ్యాచ్ ను తుదివరకూ తీసుకువెళ్లారు. చివరి బంతికి నేపాల్ గెలవాలంటే 2పరుగులు చేయాల్సిన తరుణంలో గుల్షన్ ఝా జస్ట్ ఇంచ్ తేడాతో రనౌట్ కావటంతో సంచలన ఫలితాన్ని నమోదు చేయాల్సిన నేపాల్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. పాపం నేపాల్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ వరల్డ్ కప్ లో చాలా సంచలన ఫలితాలు నమోదవుతున్న తరుణంలో నేపాల్ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే మాత్రం వాళ్ల క్రికెటింగ్ హిస్టరీలో చాలా పెద్ద మైల్ స్టోన్ అయ్యిండేది కానీ బ్యాడ్ లక్ పాపం. నాలుగు మ్యాచుల్లో నాలుగు విజయాలతో సౌతాఫ్రికా సూపర్ 8కి ఇప్పటికే అర్హత సాధించగా..నేపాల్, శ్రీలంక ప్రస్తుతానికి గ్రూప్ డీ నుంచి ఎలినిమేట్ అయ్యాయి.