South Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా
ఎన్నో ఏళ్ల కల. చోకర్స్ అన్న ముద్ర. ప్రొఫెషనల్ క్రికెట్ తో ఏడాదంతా అదరగొట్టినా వరల్డ్ కప్ కి వచ్చేసరికి కనీసం ఫైనల్ కి చేరలేక ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో. ఆ బాధ ఈ రోజు తో తీరిపోయింది. ఈ టీ20 వరల్డ్ కప్ లో సెన్సేషనల్ విజయాలతో సెమీస్ కు దూసుకొచ్చిన ఆఫ్గానిస్థాన్ సెమీఫైనల్లో చిత్తుగా ఓడించి తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కి చేరుకుంది సౌతాఫ్రికా. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ కి దిగిన ఆఫ్గాన్ సౌతాఫ్రికా బౌలర్ల పదును ముందు నిలవలేకపోయింది. నాలుగు పరుగులకే గుర్బాజ్ వికెట్ పోగొట్టుకోవటం మొదలు ఏ దశలోనూ ఆఫ్గాన్ బ్యాటింగ్ లైనప్ నిలబడే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా 11.5ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 56పరుగులకే ఆలౌట్ అయిపోయింది ఆఫ్గనిస్థాన్. పదిపరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్జాయే వాళ్ల టాప్ స్కోరర్. మార్కో జాన్సన్, షంసీ మూడేసి వెట్లు తీస్తే..రబాడా, నోకియా రెండు వికెట్లు పడగొట్టారు. 57పరుగులు చిన్న లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా...ఐదు పరుగులకే క్వింటన్ డికాక్ వికెట్ ను సమర్పించుకోవటం మినహా ఆఫ్గాన్ కు ఏ ఆనందాన్ని మిగల్చలేదు. హెండ్రిక్స్ 29, మార్ క్రమ్ 23పరుగులు బాదేసి 9ఓవర్లలోపే మ్యాచ్ ను ముగించేశారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ఈనెల 29న వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది. ఈరోజు సెమీ ఫైనల్ 2లో ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో విజేత గా నిలిచే జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాను ఢీ కొట్టనుంది.