Rohit Sharma Fearless batting | లంకతో మ్యాచ్ టై అయినా టైగర్ అంటే రోహిత్ శర్మే | ABP Desam
ఇంకా 14 బాల్స్ ఉన్నాయి. కొట్టాల్సింది ఒక్క పరుగే. చేతిలో రెండు వికెట్లున్నాయి. ఎవరైనా ఏం చెప్తారు ఆ టీమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందనే చెబుతారుగా. కానీ మనోళ్లు అద్భుతం చేశారు. ఆ ఒక్క పరుగు చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను టై గా ముగించి అందరినీ షాక్ కి గురి చేశారు. చిత్రవిచిత్రంగా సాగిన మొదటి వన్డేలో హైలైట్స్ ఈ వీడియోలో.
టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన జోష్ లో వన్డే సిరీస్ ప్రారంభమైంది. సీనియర్లు రోహిత్, కొహ్లీ తిరిగి వచ్చేయటంతో స్ట్రాంగ్ మారిన భారత్..మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బాగానే భయపెట్టింది. ఓపెనర్ పతుమ్ నిశాంక హాఫ్ సెంచర్ కొట్టడం తప్ప మరో టాప్ ఆర్డర్ బ్యాటర్ నిలబడలేకపోయాడు. ఓ దశలో 101పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక. అలాంటి టైమ్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ దునిత్ వెల్లలగే శ్రీలంకను ఆదుకున్నాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 67పరుగులు చేశాడు. శ్రీలంకకు 230పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. 231పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు అది చాలా ఈజీ అనిపించింది కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత. గిల్ ను మరో ఎండ్ లో అలానే నిలబెట్టి మరీ దడదడలాడించాడు రోహిత్ శర్మ. మొదటి వికెట్ కు 75పరుగుల పార్ట్ నర్ షిప్ పెట్టిన తర్వాత గిల్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కొహ్లీ 24పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇకంతే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే అందరూ బాగానే ఆడినట్లు కనిపించారు. 30లు కొట్టారు కానీ 231పరుగుల టార్గెట్ కు చేరటానికి టీమిండియా కష్టపడింది. చివర్లో దూబే ఆదుకోవటంతో భారత్ గెలిచేలానే కనిపించింది. 14బాల్స్ లో 1 పరుగు చేస్తే చాలన్నప్పుడు రోహిత్ శర్మ, గంభీర్ నవ్వుతూ కనిపించారు కూడా. కానీ అక్కడే కెప్టెన్ అసలంక మ్యాజిక్ చేశాడు. వరుస బంతుల్లో దూబేను, తర్వాత వచ్చిన అర్ష్ దీప్ ను అవుట్ చేసి అనూహ్యంగా మ్యాచ్ ను టై చేశాడు. ఒక్క పరుగు చేయలేక భారత్ గెలుపు అవకాశాన్ని కోల్పోయింది. సిరీస్ డిసైడర్ కాకపోవటంతో ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ జరగలేదు.