RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
18ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ ఏళ్ల పాటు ఎదురు చూసిన ఆ క్షణాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసే లోపే ఓ ఘోరం జరిగిపోయింది. ఆర్సీబీ విక్టరపరేడ్ లో తొక్కిసలాట జరిగిన చిన్నస్వామి స్టేడియం బయట 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నింపింది. భారత క్రీడాచరిత్రలోనే అత్యంత విషాదకర ఘట్టాల్లో ఒకటిగా మిగిలిపోయిన ఆ ఘటనను..ఆ మృతులను క్రికెట్ ప్రేమికులుగా శాశ్వతంగా గౌరవించాలని నిర్ణయం తీసుకుంది చిన్నస్వామి స్టేడియం. అందుకే ఏడాదిగా ఎలాంటి మ్యాచ్ లు నిర్వహించకుండా ఆపిన అధికారులు..IPL 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌తో ఈ స్టేడియం మళ్లీ క్రికెట్‌కు స్వాగతం పలకనున్నారు. గతేడాది జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గౌరవార్థం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ప్రాంగణంలో ఒక స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. స్టేడియం లోపలి ప్రవేశ ద్వారం వద్ద ఈ ఫలకాన్ని ఏర్పాటు చేయటంతో పాటు..మరణించిన 11 మంది జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక ప్రీమియర్ స్టాండ్‌లో 11 సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ సీట్లను ఏ IPL లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విక్రయించరు.. అవి ఎప్పటికీ ఖాళీగా ఉండి బాధితుల స్మృతిని గుర్తు చేస్తూనే ఉంటాయని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.