Ashwin on Slapgate Issue | లలిత్ మోదీపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్ | ABP Desam

ఇండియన్ క్రికెట్‌లో ఒకప్పుడు పెద్ద దుమారం రేపిన *"స్లాప్‌గేట్"* ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆనాటి వీడియోను ఇప్పుడు బయటపెట్టడంపై దుమారం రేగుతోంది. ఐపీఎల్ 2008లో జరిగిన ఒక మ్యాచ్ తర్వాత, హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌లను కొట్టడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయి, స్నేహితులుగా మారారు. అయితే, ఇప్పుడు లలిత్ మోదీ ఆ పాత వీడియోను బయటపెట్టడంపై అశ్విన్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. "పాత తప్పులను మళ్లీ తవ్వడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అప్పుడు జరిగిన ఘటన అటు హర్బజన్‌కి కానీ, ఇటు శ్రీశాంత్‌కి కానీ.. ఇద్దరికీ గర్వపడే విషయం కాదు. తప్పు జరిగిపోయింది. ఇక దానిని మర్చిపోయి ముందుకు సాగాలి. ఇప్పుడు ఈ వీడియో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?  అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు అశ్విన్.

 అశ్విన్ మాత్రమే కాదు, హర్భజన్, శ్రీశాంత్ కుటుంబాలు కూడా లలిత్ మోదీ.. ఈ వీడియో బయటపెట్టడాన్ని తప్పుబట్టాయి. హర్భజన్ దీనిని స్వార్థపూరిత చర్యగా అభివర్ణించగా, శ్రీశాంత్ భార్య ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడం తమ కుటుంబానికి బాధాకరమన్నారు. ఇక ఈ వీడియో బయటకొచ్చిన తర్వాత.. క్రికెట్ ఫ్యాన్స్ కూడా మళ్లీ రెండుగా చీలిపోయారు. వీడియో బయటపెట్టడం కరెక్టేనని, అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసేలా లలిత్ మోదీ చేశాడని కొంతమంది అంటుంటే.. మానిపోయిన గాయాన్ని మళ్లీ తొలిచి లలిత్ మోదీ పైశాచికానందం పొందుతున్నాడని ఇంకొంతమంది విమర్శించారు. ఏది ఏదైనా.. లలిత్ మోదీ ఆ నాటి స్లాప్‌గేట్ వీడియో బయటపెట్టడం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మళ్లీ దుమారం రేపుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola