Prime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టును కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరులో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ జట్టుకు పరాజయాన్ని రుచిచూపించింది. రెండు రోజుల వార్మప్ మ్యాచ్ లో భాగంగా మొదటి రోజు వర్షంతో తుడిచిపెట్టుకు పోగా రెండో రోజు మ్యాచ్ ను చెరో 46 ఓవర్లు ఆడేలా కుదించారు. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాను ప్రధాని జట్టు సభ్యులు బాగానే ఆడుకున్నారు. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా ఓపెనర్ ప్రైమ్ మినిస్టర్స్ 11 ఓపెనర్ 19ఏళ్ల శామ్ కోన్స్టాస్ భారత్ పై అదిరిపోయే సెంచరీ బాదాడు. 97 బంతుల్లో 107 పరుగులు చేసి భారత్ లాంటి జట్టుపై మెరుపు సెంచరీ కొట్టాడు. జేక్ క్లోటన్, హెన్నో జాకెబ్స్ కూడా తలో చేయి వేయటంతో ఆస్ట్రేలియా ప్రధాని జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హర్షిత్ రానా 4వికెట్లు తీశాడు. 46 ఓవర్ల బ్యాటింగ్ కోసం దిగిన భారత్ మరో రెండు ఓవర్లు ఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించింది. శుభ్ మాన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టి రిటైర్డ్ ఇవ్వగా...జైశ్వాల్, సుందర్, నితీశ్ రెడ్డి 40కి పైగా పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 3పరుగులకే అవుట్ కావటం నిరాశపరచగా...కొహ్లీ, పంత్ బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.