New ICC Chairman Jay Shah | జైషా కు కనీసం పోటీ కూడా పెట్టని క్రికెట్ బోర్డులు | ABP Desam
ప్రపంచ క్రికెట్ మీద బీసీసీఐ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో చెప్పటానికి ఐసీసీ ఛైర్మన్ ఎన్నికే ఓ ఉదాహరణ. గత కొన్నేళ్లుగా ఏ పదవిలో ఉన్నా బీసీసీఐను తానై నడిపిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఇప్పుడు ఏకంగా ఐసీసీ ఛైర్మన్ పదవికే ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిష్ఠిస్తున్న అతి చిన్న వయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. ఆయన వయస్సు 35 సంవత్సరాలు. ఐపీఎల్ లాంటి భారీ వ్యాపార సూత్రంతో కాసులు వర్షం కురిపిస్తున్న బీసీసీఐ తద్వారా ఐసీసీ ఆదాయంలో 75శాతం తనే అందించే స్థాయికి చేరుకుంది. మిగిలిన ఏ క్రికెట్ బోర్డు కూడా ఈ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చులేకపోతోంది. ఫలితంగానే జైషా ఐసీసీ ఛైర్మన్ కావాలని కచ్చితంగా కోరుకున్న ఈ సారి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి ఏ క్రికెట్ బోర్డు కూడా కనీసం తమ మనుషులను పోటీ కూడా పెట్టలేదు. తొలిసారి ఐసీసీ ఛైర్మన్ పదవికి ఏకగ్రీవంగా జైషా ఎన్నికయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా 2025లో జై షా పదవీ కాలం పూర్తయ్యేది. ఆ తర్వాత మూడేళ్ల తప్పనిసరి బ్రేక్ నిబంధన ఉంది. సో మూడేళ్ల పాటు బీసీసీఐ లో జైషా ఉండలేరు కానీ దీనికి జై షా ఇష్టపడలేదు. అందుకే ఈ టైమ్ ని ఐసీసీలో గడపాలని ఫిక్స్ అయ్యారు. పైగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెడుతున్నారు. అలాంటి ఓ చారిత్రక ఘట్టంలో తాను భాగం కావాలని జై షా కోరుకుంటున్నారు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ బాధ్యతలను జైషా అందుకునే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ని పాకిస్థాన్ లో పెడితే తాము ఆడమని బీసీసీఐలో ఉన్నప్పుడే ఖరాఖండీగా చెప్పిన జై షా మాట ఇప్పుడు ఐసీసీ అధిపతి కాబట్టి నెగ్గించుకునే అవకాశం ఉంది. ఆ మ్యాచులు జై షా కోరుకున్నట్లే యూఏఈలో జరిగే ఛాన్స్ లు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.