Ben Ducket vs Akashdeep | భారత పేసర్ పై చర్యలు తీసుకోవాలంటున్న ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. మ్యాచ్ లో ఆటగాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడం.. రెచ్చగొట్టేలా ప్రవర్తించడం.. ఇలా చాలానే జరిగాయి. అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో బెన్ డకెట్ ఔటైన తర్వాత అతనిపై చేతులు వేసి, ఏదో మాట్లాడాడు పేసర్ ఆకాశ్ దీప్. ఇప్పుడు ఇది వివాదస్పదమైంది. ఈ ఘటనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్పందించాడు. ఐదో టెస్టులో అనుచితంగా ప్రవర్తించిన ఆకాశ్ దీప్ పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డకెట్ కోచ్ జేమ్స్ వాట్స్ డిమాండ్ చేశాడు. జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ లో ఇలాంటి వాటికి తావుండదని, ఇప్పటికైనా ఐసీసీ ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టాలని అన్నారు. ఇంగ్లాండ్ క్రికెట్లో ఇలాంటి ఘటనలను సీరియస్ గా తీసుకుంటామని, గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు డకెట్ పై కూడా చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక హోరాహోరీగా సాగిన ఐదు టెస్టుల అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి, మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా, రెండు, ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.