Austraila Beats Scotland in T20 Worldcup | స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం | ABP Desam

టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించింది. స్కాట్లాండ్ ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్, ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్ అర్థ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్‌తో సూపర్-8 బెర్తులన్నీ దాదాపు ఖరారు అయిపోయాయి. గ్రూప్-ఏ నుంచి ఇండియా, యూఎస్ఏ, గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించాయి. గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే ఫిక్స్ అయింది. సెకండ్ ప్లేస్ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. కానీ ప్రస్తుతానికి బంగ్లాదేశ్‌కే ఎక్కువ ఛాన్స్ ఉంది. జూన్ 17వ తేదీతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి. జూన్ 18వ తేదీన అన్ని జట్లు రెస్ట్ తీసుకుంటాయి. 19వ తేదీ నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం జూన్ 27వ తేదీనే రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. జూన్ 29న జరగనున్న ఫైనల్‌తో టోర్నమెంట్‌కు శుభం కార్డు పడనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola