Vinayaka Chavithi 2025 | వినాయక నిమజ్జనం వెనకున్న పర్యావరణ రహస్యం ఇదే | ABP Desam
గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తర్వాత చివరి రోజు ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ఓ సాధారణ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకించి వినాయకుడిని గంగలో నిమజ్జనం చేయాలి అంటారు. ఇక్కడ గంగ అంటే నది అని అర్థం. నదులలో, చెరువులలో, పంట కాలువలలో యథా శక్తి కొలదీ భక్తులు తమకు అందుబాటులో ఉన్న పుష్కలమైన నీటి వనరులో వినాయకుడిని కలపటం తరాతరాలుగా వస్తున్న సంప్రదాయం. నిమజ్జనానికి ప్రధాన కారణం నది పవిత్రమైనది అందులో విగ్రహాన్ని ముంచితే తిరిగి ఆ విగ్రహాన్ని ప్రకృతిలోకి పంపడం అనే అర్థంలో చేస్తారు. అంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తారు. మట్టి ఎక్కడ నుంచి తీస్తారు. అయితే చెరువు నుంచి లేదా పంటపొలాల నుంచి తీస్తారు. అక్కడి నుంచి తీసిన మట్టితో బొమ్మను చేసి తిరిగి మట్టి గణపయ్యను చెరువులో కలపటం ద్వారా పాపాలు దూరం అవుతాయనే ధార్మిక పరమైన విషయంతో పాటు పర్యావరణానికి చేటు చేయకూడదనే సందేశం దాగి ఉంది. నీటిలో నిమజ్జనం చేయడమంటే ప్రార్థన ముగిసిన సూచనగా కూడా ఉంటుంది. ఇది ఉత్సవం ముగింపును, భక్తుల మధ్య దైవ మానుష్యపరమైన అనుబంధాన్ని మరింతగా మన జీవితాల్లోకి తీసుకెళ్తుందనేది భావన. ఇంకా, ఈ విధానం ప్రకృతితో సమన్వయం సాధించడం, ఓ ప్రకృతి పరిరక్షణ చర్యగా కూడా భావించబడుతుంది. విగ్రహాలు మట్టి లేదా సేంద్రీయ పదార్థాలతో తయారవడం వల్ల వాటి కణాలు నీటిలో కరిగి, కాలాతీతంగా పునఃసృష్టికి దారితీస్తాయి. ఇలా గంగలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి, సంప్రదాయ పురాతనత, పర్యావరణ పరిరక్షణ అన్నీ కలసి సమ్మిళితంగా జరుగుతాయి.