
NASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP Desam
తొమ్మిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే జీవితం గడుపుతున్న నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ను తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ ఇద్దరి స్థానంలో మరో నలుగురు కొత్త వ్యోమగాములను నాసా స్పేస్ ఎక్స్ సహకారంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు తీసుకువెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం క్రూ10 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగరగా...క్రూ డ్రాగన్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి స్టేజ్ 1 తిరిగి వచ్చి భూమ్మీద సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయ్యింది. 28 గంటల పాటు భూమి కక్ష్యలో తిరుగుతూ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ తో డాకింగ్ కోసం వెయిట్ చేసిన డ్రాగన్ క్యాప్సూల్ ఎట్టకేలకు ISS తో అనుసంధానమయ్యే ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. డ్రాగన్ క్యాప్స్యూల్ లో అమెరికాకు కు చెందిన మెక్ క్లెయిన్, నికోల్ అయ్యర్స్, జపాన్ కు చెందిన టకియా ఒనిషి, రష్యాకు చెందిన కిరోల్ పెస్కోవ్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టగా అప్పటికే అక్కడ ఉన్న సునీత విలియమ్స్, విల్మోర్ ఇతర సిబ్బంది కొత్త వ్యోమగాములకు సాదర స్వాగతం పలికారు. సునీత విలియమ్స్ అయితే ఏకంగా డ్యాన్స్ వేస్తూ చిన్న పిల్లలా సంబర పడ్డారు. రీజన్ ఈ కొత్తగా వచ్చిన నలుగురిని ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకువచ్చి డ్రాగన్ క్యాప్స్యూల్ లోనే సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరిగి భూమి మీదకు చేరుకోవాలి. 2024 జూన్ 5 నుంచి సునీతా విలిమయ్స్, విల్మోర్ స్పేస్ లోనే ఉంటున్నారు. వాస్తవానికి వాళ్లు వారం రోజుల్లోనే తిరిగి భూమి మీదకు రావాల్సి ఉన్నా సాంకేతిక కారాణాలతో ఆ ప్రయాణం తొమ్మిదినెలల పాటు వాయిదా పడింది.