దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
దుర్గా నిమజ్జన ఊరేగింపు సమయంలో జరిగిన ఘర్షణలతో ఒడిశాలోని కటక్‌లో కొన్ని ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. శనివారం దుర్గా నిమజ్జనం సందర్భంగా డీజే పెట్టడంపై రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఆ ఘర్షణలో డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. అయితే అతి కష్టం మీద ఘర్షణలకు కారణమైన వ్యక్తులని తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. అయితే ఆ ఘర్షణలకు కారణమైన రెండు గ్రూపుల్లోకి కొంతమంది ఆదివారం రాత్రి మళ్లీ ఒకరిపై ఒకరు రాళ్లదాడికి తెగబడ్డారు. వాహనాలకు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే కటక్ పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులని తరిమికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులు మొహరించి పహారా కాస్తున్నారు. ఇక ఘర్షణల నేపథ్యంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా వినియోగంపై ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం రాత్రి 7 గంటల వరకు నిషేధం విధిస్తున్నట్లు ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది.