Tweet tussle between Somu & Vijayasai: ట్వీట్ల తూటాలు..!
భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లు మార్చాలని కోరే బదులు... ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై జాతీయ నాయకత్వంపై రాష్ట్ర భాజపా నాయకులు ఒత్తిడి తెస్తే మంచిదని విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ లో హితవు పలికారు. 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామన్న వ్యాఖ్యలను కవర్ చేసుకునేందుకే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సోము వీర్రాజు వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఎదురుచూసే మీలాంటివారితో నీతులు చెప్పించుకునే స్థితిలో భాజపా లేదని స్పష్టం చేశారు. భూ, ఇసుక, మద్యం ద్వారా పేదలను పీక్కు తినే రాబందుల వంటి వైకాపా నాయకులా మాకు హితబోధలు చేసేదని నిలదీశారు. విశాఖ భూములపై కన్నేసి 3 రాజధానుల కుట్రకు దారితీసినవారి నీతులు అవసరం లేదని విజయసాయి విమర్శలను తిప్పికొట్టారు. పోలవరం, అమరావతిని నిర్మించేది, విశాఖ ఉక్కును కాపాడేది, ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చేది భాజపా ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. వివిధ భవనాలకు దేశద్రోహుల పేర్లు మార్చకపోతే తాము అధికారంలోకి వస్తూనే వాటిని మారుస్తామని సోము వీర్రాజు అన్నారు.