SC Appoints 5member Panel : ప్రధాని MODIకి భద్రతా వైఫల్యం అంశంపై ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి తలెత్తిన భద్రతా లోపాలపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రాతోపాటు పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ సెక్యూరిటీ ఏడీజీ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ ఏకపక్షంగా జరగకూడదన్న పంజాబ్ ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. పలు అభివృద్ధి పనులకు ఈ నెల 5న శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ పంజాబ్ కి వెళ్లారు. అయితే మార్గ మధ్యంలో ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్‌ను కొంత మంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.