అమెరికాలో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్‌కమ్, క్వాడ్ సమ్మిట్‌లో ప్రసంగం
మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి...అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆయన వచ్చీ రాగానే మోదీ మోదీ అంటూ నినదించారు. జైశ్రీరామ్ నినాదాలూ చేశారు. కొందరు అభిమానులు ఆయనకు స్పెషల్ గిఫ్ట్‌లు అందించారు. కళాకారులు తమ పాటలు, డ్యాన్స్‌లతో మోదీని అలరించారు. జోబైడెన్‌ని కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ...తరవాత క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇండో పసిఫిక్‌ని వివాదరహితంగా చేయాలనే ఒకే లక్ష్యంతో క్వాడ్ దేశాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇదే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలతో క్వాడ్ సభ్య దేశాలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ఏ తగాదాలనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని తెలిపారు ప్రధాని మోదీ. హెల్త్, సెక్యూరిటీ రంగాల్లో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించగలిగామని అన్నారు. 2025లో భారత్‌లో క్వాడ్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన చేశారు. ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఉన్నారు.