PM MODI: ఫ్లై ఓవర్ పైనే ఉండిపోయిన ప్రధాని
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. హుస్సైనీవాలాలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకునేందుకు ఈ రోజు ఉదయం భటిండాకు హెలికాప్టర్ ద్వారా ప్రధాని చేరుకున్నారు. వర్షం సహా ఇతర వాతావరణ కారణాల వల్ల... గమ్యస్థానానికి బయల్దేరేందుకు సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని అక్కడే వేచిచూశారు. అయినా వాతావరణం క్లియర్ అవకపోవటంతో... రోడ్డు మార్గంలో అమరవీరుల స్థూపానికి చేరుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పంజాబ్ డీజీపీ నుంచి హామీ వచ్చిన తర్వాతే రోడ్డు మార్గంలో ప్రయాణం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హుస్సైనీవాలాలోని గమ్యస్థానానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా... ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకుంది. రోడ్డును కొందరు ఆందోళనకారులు అడ్డగించినట్టు గుర్తించారు. ఫ్లై ఓవర్ పైనే ప్రధాని సుమారు 20 నిమిషాల పాటు ఉండిపోయారు. ప్రధాని పర్యటన ఉన్నప్పటికీ సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పంజాబ్ యంత్రాంగం విఫలమైనట్టు సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం భటిండా ఎయిర్ పోర్టుకు ప్రధాని వెనుదిరిగారు. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర హోంశాఖ... పంజాబ్ ప్రభుత్వం నుంచి సవివర నివేదికను కోరింది.