What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
ఈ మధ్య అంతా డిజిటల్ మయం అయిపోయింది. దాంతోపాటు సైబర్ నేరాలు పెరిగి పొయ్యాయి. వీటిలో ఒకటి డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఇది ప్రజలను భయపెట్టి మోసం చేసే కొత్త మార్గం. ఈ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు తమను తాము పోలీసులు, ప్రభుత్వ అధికారులు అంటూ పరిచయం చేసుకొని ప్రజలను మోసం చేస్తారు. మీపై కేసు నమోదు అయిందని లేదా మీ అరెస్ట్ కోసం వారెంట్ జారీ అయిందని చెప్తారు.
మిమ్మల్ని భయపెట్టడానికి అరెస్ట్ వారెంట్ లేదా కోర్టు సమన్లు వంటి నకిలీ పత్రాలను పంపవచ్చు. నేరస్తులు వెంటనే జరిమానా చెల్లించాలని, బ్యాంక్ వివరాలను చెప్పాలని లేదా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి లింక్‌లను కూడా పంపుతారు.
అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటే డిజిటల్ అరెస్టులు మరింత ఎక్కువయ్యాయి. వీటిని నియంత్రించడానికి సుప్రీమ్ కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు నమోదు అయిన FIR వివరాలను తమకు సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.