8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!
రాజస్థాన్‌లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్ చూస్తే దాంట్లోని ఎవరైనా కచ్చితంగా చనిపోయి ఉంటారనే అనుకుంటారు. అంత ఘోరంగా ప్రమాదం జరిగిన తీరు ఉంది. కానీ, విచిత్రం ఏంటంటే.. కారు 8 పల్టీలు కొట్టినా అందులోని ఐదుగురు అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. వారికి చిన్న గాయం కూడా కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాజస్థాన్‌లోని నాగౌర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్ బయల్దేరగా.. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. సెకన్ల వ్యవధిలోనే కనీసం ఎనిమిది సార్లు పల్టీలు కొట్టి ఓ కారు షోరూమ్ గేటుపై బోల్తాపడింది. పల్టీలు కొడుతున్న సమయంలో అందులోని ప్రయాణికులు బయటకు దూకేశారు. పైగా కారు షోరూమ్ లోపలికి వెళ్లి.. కొంచెం టీ ఇస్తారా అని అడిగినట్లుగా స్థానిక వార్తా సంస్థలు రాశాయి.