Mysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam
మైసూర్ పాక్ " ఇష్టపడని వాళ్ళు , రుచి చూడని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరేమో. ఊరి పేరుతో పాపులర్ అయిన అతికొద్ది స్వీట్లలో మైసూర్ పాక్ ముఖ్యమైనది. హిస్టారికల్ సిటీ మైసూర్ లో పుట్టిన మైసూర్ పాక్ ప్రజలందరికీ చేరువైన కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మైసూర్ పాక్ పాపులారీటీ చూసి ఇదేదో పురాతనమైన వంటకం అనుకుంటే పొరబాటే. గట్టిగా మాట్లాడితే ఈ స్వీట్ పుట్టి వందేళ్లు కూడా కాలేదు. మైసూర్ ను 1902 నుండి 1940 వరకూ పరిపాలించిన 24వ మహారాజు 4వ కృష్ణారాజ వడయార్ మంచి భోజన ప్రియుడు. ఆయన భోజనానికి కూర్చుంటే బోలెడన్ని రకాల ఆహార పదార్థాలు ఆయన ముందు ఉండాల్సిందే. రాజ కుటుంబ అంతఃపురానికి "కాకాసుర మడప్ప " ప్రధాన వంటగాడు. ఒకసారి ఆయన తన మహారాజుకు ఒక కొత్త వంటకం రుచి చూపిద్దామని వంట గదిలోని అతి తక్కువ పదార్థాలు శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు కలిపి ఒక స్వీట్ తయారు చేసారు. దాని రుచి మహారాజుకు బాగా నచ్చడంతో దీని పేరు ఏంటని అడిగాడు. మడప్ప కు ఏం చెప్పాలో తెలియక పంచదార "పాకం"లో శనగపిండి వేసి కలిపాడు కాబట్టి దానితో పాటే తమ రాజ్యం మైసూరు కలిసి వచ్చేలా "మైసూరు పాక" చెప్పాడు. అదే తర్వాతి కాలంలో " "మైసూర్ పాక్" గా మారింది. మహారాజు కృష్ణరాజు వడయార్ మైసూర్ పాక్ రుచి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా ప్రజలందరికీ తెలియాలని తమ కోట " ప్యాలెస్ కు సమీపంలో " ఒక దుకాణం ఏర్పాటు చేయమని మడప్పకు సూచించారు.