అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!
కర్ణాటకలోని మండ్యలో ఎక్సైజ్ పోలీసులు ఓ భారీ స్కామ్ ని గుర్తించారు. ఈ దాడిలో 560 లీటర్ల లిక్కర్, ఇంకా దాన్ని తయారు చేసే మిషన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మండ్య నగరంలోని చిక్కగౌడనదొడ్డిలో అద్దె ఇంట్లో కల్తీ మద్యం తయారుచేస్తున్న వారిపై దాడి జరిగింది. అద్దె ఇంట్లో నివసిస్తున్న పార్వతమ్మ అనే మహిళ.. స్థానిక లిక్కర్ బ్రాండ్‌లైన సిల్వర్‌కప్ నుంచి బ్లాక్ అండ్ వైట్ వంటి ప్రీమియం బ్రాండ్‌ల వరకు నకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది. మండ్య నగరంలోని కామధేను కంఫర్ట్ బార్ అండ్ రెస్టారెంట్ ద్వారా ఈ కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎక్సైజ్ పోలీసులు దాడి చేయడంతో మొత్తం విషయం బట్టబయలైంది. ఇప్పటి వరకు ఓ నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. 18 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న అధికారులు, దీంతో ప్రమేయం ఉన్న వారందరినీ కనిపెట్టేందుకు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.