G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మందికి ఉపాధి కల్పించిన 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'.. షార్ట్‌గా MGNREGA స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. అదే 'జీ రామ్ జీ' (G RAM G) బిల్లు. అసలు ఏంటీ బిల్లు? ఉన్నట్లుండి మన్‌రేగా తీసేసి.. ఆ పథకం ప్లేస్‌లో ఈ పథకం తీసుకురావాలని కేంద్రం ఎందుకనుకుంటోంది? దీనివల్ల ఉపాధి కూలీలకు లాభమా? నష్టమా? అన్నింటికంటే ముఖ్యంగా ఈ బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పదండి ఈ రోజు ఇండియా మాటర్స్‌లో తెలుసుకుందాం.
"కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సరికొత్త బిల్లు.. 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ - గ్రామీణ్'. దీన్నే సంక్షిప్తంగా G RAM G అని పిలుస్తున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగానే పాత మన్‌రేగా బిల్లును తీసేసి.. దాని ప్లేస్‌లో ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. అయితే పాత బిల్లుకు, ఈ బిల్లుకు అంతలా తేడా ఏముంది? అంటే.. ముఖ్యంగా మూడు తేడాలున్నాయి.
1. పని దినాలు: పాత పథకంలో ఏడాదికి 100 రోజులు పని ఇచ్చేవారు, కానీ కొత్త బిల్లులో దీన్ని 125 రోజులకు పెంచారు.
2, నిధులు: ఇప్పటివరకు కూలీల వేతనాలను 100% కేంద్రమే ఇచ్చేది. కానీ ఇకపై కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంటుంది.
3: వ్యవసాయ విరామం: విత్తనాలు వేసేటప్పుడు, కోతల సమయంలో కూలీలు దొరకడం లేదని రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఏడాదిలో 60 రోజుల పాటు ఈ పనులకు విరామం ప్రకటించారు. దీనివల్ల ఈ పనులకు వచ్చేవాళ్లు ఈ గ్యాప్‌లో వ్యవసాయ పనులకు వెళ్లగలుగుతారు" అంతేకాకుండా.. ఈ కొత్త పథకం ద్వారా గ్రామాల్లో కేవలం గుంతలు తీయడం వంటి పనులు మాత్రమే కాకుండా, గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించాలనేది కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. అలాగే AI, జియో ట్యాగింగ్ వంటి సాంకేతికతను వాడి అవినీతిని అరికట్టడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుందనేది కేంద్రం మాట. పని దినాలు పెంచడం వల్ల కూలీల ఆదాయం 25% పెరుగుతుందని కూడా కేంద్రం చెప్తోంది. మరి అంతా మంచే జరుగుతోంది కదా? మరి ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ఈ కొత్త పథకాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం.. ఈ పథకం పేరే. 'మహాత్మా గాంధీ' పేరున ఏర్పాటు చేసిన పాత పథకాన్ని తొలగించి కొత్తగా రాంజీ అంటూ రాముడి పేరు వచ్చేలా ఈ పథకం పేరును పెట్టడంపైనే కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే కార్మికుల వేతనాల్లో 40% రాష్ట్రాలే భరించాలనే రూల్‌ని కూడా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలా 40 శాతం వేతనాలు రాష్ట్రాలు భరించాలంటే పేద రాష్ట్రాల పరిస్థితేంటని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏడాదిలో 60 రోజులు పనులు నిలిపివేయడం వల్ల ఆ సమయంలో పేద కూలీల పొట్ట కొట్టినట్లవుతుందని కూడా కాంగ్రెస్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఏది ఏమైనా మొత్తానికి, గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ బిల్లు అని ప్రభుత్వం అంటుంటే.. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రస్తుతానికైతే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది.. రాజ్యసభలో ఆమోదం కోసం వెళ్లింది. అయితే లోక్‌సభలో కానీ.. రాజ్యసభలో కానీ ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నంతసేపూ ప్రతిపక్షాలు నానా గందరగోళం సృష్టించాయి. బిల్లు ప్రతులను చించి సభలో వెదజల్లాయి. అయితే ఈ గందరగోళం మధ్యే లోక్‌సభలో మూజువాణీ ఓటింగ్‌తో ఈ బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం రాజ్యసభలో దీనిపై చర్య జరుగుతుండగా.. అక్కడ కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఈ వ్యతిరేకత మధ్యే రాజ్యసభలో కూడా ఈ జీ రామ్ జీ బిల్లు ఆమోదం పొందితే.. చివరిగా రాష్ట్రపతి సంతకంతో పూర్తి చట్టంగా మారుతుంది. 100 రోజుల నుండి 125 రోజులకు పని పెంచడంపై మీ ఒపీనియన్ ఏంటి?? 40 శాతం భారం రాష్ట్రాలపై వేయడం కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి.