Elon Musk Starlink License Approved in India | దేశంలో మూడో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా స్టార్ లింక్ | ABP Desam
భారత టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో ఓ ఆసక్తికర పరిణామం ఈ రోజు జరిగింది. అపరకుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ స్టార్ లింక్ కు భారత్ అనుమతి ఇచ్చింది. తద్వారా భారతీ వన్ వెబ్, రిలయన్స్ జియో తర్వాత దేశంలో మూడో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ గా స్టార్ లింక్ రికార్డు సృష్టించింది. అతి చిన్న యాంటెన్నాను ఇంటికి అమర్చుకోవటం ద్వారా స్టార్ లింక్ శాటిలైట్స్ నుంచి నేరుగా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలను అందించటం స్టార్ లింక్ ప్రత్యేకత. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సమాచార వ్యవస్థ అంతా చిన్నా భిన్నమైన ఉక్రెయిన్ దేశం ఇంకా నిలబడిందంటే కారణాల్లో ఒకటి స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ను చెబుతారు. భూమార్గంతో పని లేని ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా కోట్ల రూపాయల కేబుళ్ల నిర్వహణ భారం కంపెనీకి తగ్గటంతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా చౌక ధరకే వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. గతంలో ఈ అనుమతులను స్టార్ లింక్ మధ్యవర్తిగా జియో, ఎయిర్ టెల్ కంపెనీలు సాధించేందుకు ప్రయత్నాలు జరగగా..ఇప్పుడు నేరుగా స్టార్ లింక్ కే అనుమతులు రావటంతో టెలికమ్యూనికేషన్స్ రేస్ లో జియో, ఎయిర్ టెల్ లు గట్టిపోటీనే ఎదుర్కోనున్నాయి.