ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందే
విమానాలు బయల్దేరాల్సిన టైం కన్నా ఆలస్యం అవుతుండడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఫ్లైట్ జెర్నీలు చేసేవాళ్లు ఈ అనుభవాన్ని చాలాసార్లు పొందే ఉంటారు. ఫ్లైట్ లేట్ అయితే చేసేదేంలేక నిరాశలో ఉండిపోతుంటారు. కానీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇకపై విమానాల ఆలస్యం అయితే ఆయా విమానయాన సంస్థలు డీజీసీఏ సూచనలను తప్పకుండా అనుసరించాలని సూచించింది. విమానాల ఆలస్యం సమయంలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ఎయిర్‌లైన్ సంస్థలను ఆదేశించింది. 2 గంటల వరకు విమానం ఆలస్యం అయినప్పుడు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు తాగునీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 2 నుండి 4 గంటల మధ్య ఆలస్యం అయితే స్నాక్స్ టీ లేదా కాఫీ అందించాలి. అదే 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే భోజనం కూడా అందించాలని డీజీసీఏ ఆదేశించింది. ఇటీవల నార్త్ ఇండియాలో పొగమంచు కారణంగా ఎక్కువ ఫ్లైట్ సర్వీస్ లు డిలే అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా నిబంధనలను విధించింది.