
Delhi HC Judge Transferred After Cash Recovery | హైకోర్టు జడ్జి ఇంట్లో భారీగా దొరికిన నోట్ల కట్టలు | ABP Desam
ఓ న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన ఘటన శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. రాజ్య సభ ప్రారంభం కాగానే...కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు చేశారు జైరాం రమేశ్. ఓ న్యాయమూర్తి ఇంట్లోనే అన్ని కట్టల డబ్బులు గుట్టలు గుట్టలుగా ఉండటం దేనికి సంకేతం అని ప్రశ్నించిన జైరాం రమేశ్..దీనపై పార్లమెంటు స్థాయిలో ఎంక్వైరీ చేయించాలని రాజ్యసభ ఛైర్మన్ ధనకర్ ను కోరారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఘటనను రాజ్యసభ ఛైర్మన్ ధన్ కర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. తక్షణమే కొలిజీయం ఏర్పాటు చేసిన సంజీవ్ ఖన్నా... జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయటంతో పాటు ఆయన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని నిర్ణయించారు.
అసలు ఏం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లా లో అగ్నిప్రమాదం జరిగింది. జస్టిస్ వర్మ ఊళ్లో లేకపోవటంతో ఆయన ఇంట్లో వాళ్లు కంగారుపడి ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేశారు. మంటలను ఆర్పే సమయంలో ఓ గది లో భారీగా కరెన్సీ కట్టలు ఉండాలన గమనించిన ఫైర్ సిబ్బంది ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకు లీక్ చేశారు. అక్టోబర్ 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు జస్టిస్ యశ్వంత్ వర్మ. న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చే ఈ ఘటనను చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలని చూస్తున్న సుప్రీంకోర్టు..1999లో ఏర్పాటైన అంతర్గత విచారణ విభాగం ఎదుట ఎంక్వైరీకి హాజరుకావాలని జస్టిస్ యశ్వంత్ వర్మకు సూచించనుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని భావించింది.